తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కృష్ణుని జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి సుదర్శనాచార్యుల, ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు అమల నీమై దాసు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వార్లకు, పూలాభిషేకం విశేష పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులకు శ్రీకృష్ణ రాధా సమేతంగా దర్శనమిచ్చారు. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలిచాయి. కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతో వైభవంగా జరగాల్సిన ఈ పర్వదినాన్ని కుదించి కొద్ది మంది భక్తులతో నిర్వహించామని తెలిపారు అమల నిమయి దాస్. వినయం.. నిజాయతీ.. శ్రమ.. ధర్మాన్ని అనుసరించడం.. దుర్మార్గాన్ని దూరంగా పెట్టడం.. ఇవే శ్రీకృష్ణుడు చెప్పిన విజయానికి ఐదు మంత్రాలని ఆయన పేర్కొన్నారు. వీటిని అనుసరించడం ద్వారా జీవితాన్ని సాఫల్యం చేసుకుందామని చెప్పారు.