ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయంపై కోర్టులో కేసులు ఉన్నాయి. కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఏపీకి అమరావతే రాజధాని. ఇది చాలా క్లియర్. విషయం ఇంత స్పష్టంగా ఉన్న కేంద్రం మాత్రం ఏపీ ప్రజల్ని గందరగోళానికి గురి చేసేలా ప్రకటన విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రకటనపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కోర్టు నిర్ణయం తీసుకునేవరకు అమరావతే రాష్ట్ర రాజధాని. ఏపీ రాజధాని ఏది అని ఇటీవల ఆర్టీఐ ద్వారా అడిగితే.. మూడు రాజధానుల ప్రతిపాదన ఉన్నదని జవాబు ఇచ్చింది. తాజాగా పెట్రో పన్నులు ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేస్తున్నారనేది చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైజాగ్ పేరు ప్రస్తావించి మరోసారి ఏపీ ప్రజలని గంగరగోళానికి గురి చేసింది. సభలో ప్రభుత్వం ప్రతిస్పందించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చింది. పెట్రో ఉత్పత్తుల ధరలు ఏఏ రాష్ట్రాలో ఎంత పెరిగింది.. వాటిపై ఆయా రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు ఎంత… తదితర అంశాలను, ఆయా రాష్ట్రాల రాజధానుల పేర్లతో సహా ఓ పట్టిక రూపంలో ప్రభుత్వం లోక్‌సభ సభ్యులకు అందచేసింది. అందులో అన్ని రాష్ట్రాలకూ ఆయా రాజధానుల పేర్లును సక్రమంగానే పేర్కొన్న అధికారులు… ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రాజధానిగా వైజాగ్ అని పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సాంకేతికంగానూ, భౌతికంగానూ రాజధానిగా అమరావతే ఉంటే… వైజాగ్‌కి అది ఎప్పుడు మారిందని పలువురు విస్తుపోతున్నారు.