నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై టిడిపి ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు జిల్లాల్లో వినూత్నరీతిలో నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. పెట్రోల్ ,డిజీల్ ,వంటగ్యాస్ ధరల పెరుగుదలపై రోడ్డెక్కారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర సరుకులు అధిక ధరకు విక్రయిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందన్నారు నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు గోనుగుంట్ల కోటేశ్వరావు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులిచ్చి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఇచ్చిన దానికి నాలుగు రెట్లు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని విమర్శించారు నియోజకవర్గ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు. జగన్ రావాలన్న వారే, రెండేళ్ల పరిపాలన చూశాక పోవాలి అంటున్నారని ఎద్దేవా చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో ధరల పెరుగుదలపై వినతి పత్రం సమర్పించి అనంతరం ఆకాశాన్నంటిన కూరగాయలు, సరుకుల ధరలను నిరసిస్తూ ఖాళీ విస్తరెలో తింటున్నట్టుగా నిరసన తెలిపారు టీడీపీ నేతలు. ఈ కార్యక్రమంలో టీడీపీ సినీయర్ నేత మన్నే రవీంద్ర, చేకూరి సుబ్బారావు, బట్టు సుధాకర్ రెడ్డి, పయ్యావుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.