టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత సైలెంట్ గా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా కొడుకు, మేనల్లుడితో పాటే కుమార్తెను కూడా కొన్నాళ్లు దూరం పెట్టిన కేసీఆర్.. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత కాస్త వెనక్కి తిరిగిచూశారు. కేటీఆర్, హరీష్ రావులను పిలిచి.. మళ్లీ కీలకమైన బాధ్యతలని వారికి అప్పగించారు. కానీ కవితను మాత్రం కేసీఆర్ అసలు పట్టించుకోకపోవడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.
కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే మానేశారు. ఆహ్వానం లేదో లేదా తనకే ఆసక్తి లేదో తెలియదు కానీ ఏ వేదికపైనా కవిత అస్సలు కనిపించడం లేదు. ఈటల వ్యవహారం ముందూ, తర్వాత కూడా.. దాదాపుగా కొన్ని నెలలుగా కవిత పొలిటికల్ స్క్రీన్‌పై ఆచూకీ లేకుండాపోయారు. 2109 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయినప్పటికీ.. ఆ మధ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించేవారు కవిత. ఆతర్వాత అక్టోబర్ 2020 లో నిజామాబాద్ జిల్లా నుంచి MLC గా గెలవడంతో.. మళ్లీ టీఆర్ఎస్లో ఆమె ప్రాధాన్యత పెరిగిపోయినట్టు కనిపించింది.
కవిత కేబినెట్లో చేరతారని పుకార్లు కూడా వచ్చాయి. కానీ నెలలు గడిచినా అదేం జరగకపోగా.. కవిత మళ్లీ తెరవెనుకకకే వెళ్లిపోయారు. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్‌తో తీరికగా మాట్లాడేందుకు కవితకు అసలు అవకాశమే దొరకడం లేదని, పైగా ఆయనతో మాట్లాడాలనుకుంటే పదే పదే సంతోష్ రావు అనుమతి తీసుకోవాల్సి రావడం ఆమెకు నచ్చడం లేదని తెలుస్తోంది. పైగా కేసీఆర్ ఈ మధ్య కేటీఆర్ కంటే కూడా సంతోష్ రావుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె కినుక వహించారని అనుకుంటున్నారు.