ఇన్నాళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన అధికార టీఆర్ఎస్ కు ఇప్పుడు రివర్స్ లో భారీ షాక్ తగలనుందా..? గులాబీ పార్టీకి ఎమ్మెల్యే గుడ్ బై చెప్పెయనున్నారా..? ఆ ఎమ్మెల్యే వైఎస్సార్ టీపీ తీర్ధం పుచ్చుకోనున్నారా..?సడెన్ గా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను షర్మిల భర్త అనిల్ కలవడం వెనక అంతర్యం ఏంటి..?
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఎమ్మెల్యే రాజయ్య , వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల భర్త అనిల్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది వ్యక్తిగత భేటీ అని పైకి చేబుతునా…ఎదో జరుగుతుందన్న అనుమానం మాత్రం బలపడుతోంది. షర్మిలతోనూ ఇదివరకు రాజయ్య భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు షర్మిల భర్తతో ఆయన భేటీ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
స్టేషన్ ఘన్ పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న రాజయ్యకు…మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పొసగడం లేదు. వీరి మధ్య సత్సంబంధాలు కరువయ్యాయి. మరో వైపు సిఎం కేసీఆర్ కూడా కడియం వైపు ఉండటంతో రాజయ్య అలక బూనారు. ఇటీవల వరంగల్ టూర్ లో కడియం ఇంట్లో భోజనం చేయడం, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడం రాజయ్యకు నచ్చలేదు. తనను కాదని కడియంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రాజయ్య పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే రాజయ్య షర్మిల భర్తతో భేటీ అయినట్లు చెబుతున్నారు.