తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే జన్మించాడా అన్నట్లు సాగింది ఆయన జీవిత ప్రయాణం. పుట్టుక నుంచి చావు వరకు ప్రత్యేక కళను స్వప్నించిన తెలంగాణ ఉద్యమాల ఉపాధ్యాయుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో, ఎందుకు ఉద్యమంలో మమేకం కావాలో చెప్పి ఉద్యమానికి దిశానిర్దేశానం చేసిన పెద్ద సారూ జయంతిన మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులర్పించలేదు. దీంతో ఉద్యమకారుల నుంచి కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

తెలంగాణ సిద్దాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరుపై ఉద్యమకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే తన జీవితాన్ని ధారపోసిన జయశంకర్ చిత్రపటానికి కనీసం పూలమాల వేసి, స్మరించుకునేందుకు ఆయనకు మనస్సు రాకపోవడం దారుణమని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఊరువాడా, జయశంకర్ సేవలను కీర్తిస్తుంటే…ఆయన అడుగులో అడుగు వేసి..ఆయన సలహాలు, సూచనలు పొందిన కేసీఆర్ మాత్రం జయశంకర్ జయంతి రోజున కనీసం పూలమాల వేసి స్మరించకపోవడం దారుణమని అంటున్నారు ఉద్యమకారులు. ఇదేనా కేసీఆర్ జయశంకర్ సర్ కు ఇచ్చే గుర్తింపు అని ప్రశ్నిస్తున్నారు.

జయశంకర్ గురించి కేవలం ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసి…అదే పెద్ద గౌరవ సూచకమని కేసీఆర్ భావించినట్టు ఉన్నారని ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఉద్యమంలో జయశంకర్ సలహాలను వాడుకున్న కేసీఆర్…ఆయనకు కనీసం నివాళులర్పించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఐదు నిమిషాల జయశంకర్ కోసం కేటాయించలేరా అని నిలదీస్తున్నారు. జయశంకర్ ను ఎంత మరుగున పడేస్తే…అది తనకు అంత బెన్ ఫిట్ అవుతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఉన్నారని ఆరోపిస్తున్నారు ఉద్యమకారులు.