గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుంది. టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా పార్టీ అధినేత కేసీఆర్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న తీగలను తాజాగా టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీకేఆర్ కళాశాలకు వెళ్ళిన రేవంత్…తీగలను కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వాహించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
గత ఎన్నికలల్లో తన సమీప ప్రత్యర్ధి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినేత కేసీఆర్ ఆఫర్ చేశారు. మరోవైపు సబితా కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొని మంత్రి పదవిని దక్కించుకోవడంతో ఆయన మప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికలు ముగిశాక ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా వేళ…మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయన వియ్యంకుడు చామకూర మల్లారెడ్డి ద్వారా రాయబారం నడిపి తీగలను టీఆర్ఎస్ లోనే ఉంచారు.
కాని ఇస్తామని ఆఫర్ చేసినా ఎమ్మెల్సీ పదవి మాత్రం ఇంకా ఇవ్వలేదు.పైగా సబితా టీఆర్ఎస్ లో చేరినా నాటి నుంచి ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ ఆయనను కలిసి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. మరో వైపు టీఆర్ఎస్ ను కాదని…కాంగ్రెస్ లో చేరితే ఏదైనా ఇబ్బందులు ఎదురు అవుతాయా అనే ఆలోచనలో తీగల ఉన్నట్లు చెబుతున్నారు. అయన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమోనని అంటున్నారు.