తెలంగాణ ప్రభుత్వ తీరును హైకోర్టు కడిగిపారేసింది. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించింది. ట్రెజరీ నిబంధనలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ పై నమోదైన కోర్టు ధిక్కారణ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అధికారి కోర్టు ధిక్కారణ కేసులో విచారణ కోసం ప్రభుత్వ నిధులను ఎలా ఖర్చు చేస్తారని హైకోర్టు కేసీఆర్ సర్కార్ ను నిలదీసింది. విచారణ కోసం కేటాయించిన నిధులను విడుదల చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో సీసీఎల్ఏ కమిషనర్‌గా, ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సోమేష్ కుమార్‌పై భారీగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. ఆయనపై కోర్టులో జరుగుతున్న విచారణ కోసం ప్రభుత్వం 58 కోట్లను మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ నిర్ణయంపై అధ్యాపకుడు ప్రభాకర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ పిల్ పై విచారణ జరిపింది. ప్రభుత్వ నిర్నయంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వాధికారిపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల కోసం అంత మొత్తంలో నిధులను మంజూరు చేయడం ఏంటని ఆశ్చర్యపోయింది. ఇష్టానుసారంగా ప్రజా ధనాన్ని ఎలా ఖర్చు పెడతారని నిలదీసింది. పలువురికీ నోటిసులు పంపిన హైకోర్టు…తదుపరి విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసింది. అప్పటి వరకు నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.