ప్రవీణ్ కుమార్ చేరికతో బీఎస్పీ బలపడేనా..?

క్లారిటీ వచ్చేసింది…మాజీ ఐపీఎస్ అధికారి రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం ఖాయమైంది. ఆయన వచ్చే నెల ఎనిమిదిన బీఎస్పీలో చేరనున్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఎస్పీలో చేరనున్న ఆర్ఎస్… పాలిటిక్స్ పై ఎలాంటి ప్రభావం చుపనున్నారు..?ఆయన నిర్ణయాన్ని దళిత , బహుజనులు ఎలా రీసివ్ చేసుకుంటున్నారు…?గురుకులాల అధికారిగా దళిత, బహుజన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చేరువ అయిన ఆర్ఎస్…బీఎస్పీ ద్వారా రీచ్ అయ్యే స్కోప్ ఉందా…?ఆయన చేరికతో బీఎస్పీ తెలంగాణలో పుంజుకుంటుందా…?ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భావం కాకపోయినా…ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతుండటం ఓ కొత్త పరిణామమే. నిజానికి బీఎస్పీ మద్దతుదారులు, కొంతమంది దళిత బహుజన మేధావులు బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభావం ఇప్పటీ వరకు అంతంత మాత్రమే. తెలంగాణలో ఆ పార్టీకి రెండు శాతం ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ అది నానాటికీ కరుగుతూ వచ్చింది. ఆ పార్టీ గుర్తుతో 2014 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా..అక్కడి నుంచి జంప్ చేసి అధికార పార్టీలో చేరిపోయారు. ఫలితంగా బీఎస్పీకి ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. అయినా లీడర్లు పోయినంత మాత్రానా…ఆ పార్టీ సిద్దంతాలు, ఆశయాలు నచ్చి చేరిన ఎంతోమంది ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. వారంతా ఓ కొత్త , సమర్ధవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ చేరికతో వారి ఆశలకు రెక్కలు వచ్చినట్లే. నూతన ఉత్సాహంతో వారంతా పార్టీలో తిరిగి యాక్టివ్ కానున్నారు.

తెలంగాణలో దళిత, బహుజన జనాభా 75 శాతానికి పైగానే ఉంటుంది. ఈ పరిస్థితులను గమనించిన కేసీఆర్ నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో దళిత, బహుజనులను తనవైపు చూసేలా ప్రకటన చేశారు. తెలంగాణ వస్తే ప్రత్యేక రాష్ట్రానికి దళితుడే సిఎం అని ప్రకటించారు. కాని నాటి ప్రకటన ఓటు బ్యాంక్ రాజకీయమేనని తేలింది. నిజానికి తెలంగాణలో దళిత, బహుజన నాయకత్వం ఎదిగేందుకు మంచి స్కోప్ ఉన్న ప్రాంతం. అందుకే కేసీఆర్ నాడు దళిత సిఎం పల్లవి ఎత్తుకున్నాడనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ హామీని విస్మరించి ఆయనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా…ఆయనకు దళిత నేతలే హారతులు పట్టారు. ఈ పరిణామం దళిత సామజిక వర్గానికి చెందిన బుద్ది జీవులకు చికాకు తెప్పించినా…వాళ్ళు మారారంటూ సైలెంట్ గానే ఉండిపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి అకారణంగా రాజయ్యను తొలగిస్తే ఆ సామజిక వర్గం నుంచి ఆశించినంత వ్యతిరేకత రానే లేదు. పైగా ఆయన వదిలేసినా కుర్చీలోనే అదే సామజిక వర్గానికి చెందిన నేత ఆసీనులు కావడం ఆశ్చర్య పరచలేదు కాని విషాదానికి లోనయ్యేలా చేసింది.

గోడ పిల్లిలా ఉండే నాయకత్వం, పదవులకు ఆశ పడి లొంగిపోయే మనస్తత్వం ఉన్న నాయకత్వం ఉండటం వలనే సిద్దంతాలు, ఆశయాలతో నిలబడే వారు పార్టీలో కొంతమంది తప్ప మరెవరు ఉండటం లేదు. అదే సమర్ధవంతమైన నాయకత్వం ఉండి ఉంటె బీఎస్పీ పార్టీ వంటి జాతీయ పార్టీ తెలంగాణలో ఎదిగేందుకు అవకాశం ఉండి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం ఆర్ఎస్ రూపంలో బీఎస్పీకి వచ్చినటు కనిపిస్తోంది. ఆర్ఎస్ చేరికతో బీఎస్పీ పార్టీ తెలంగాణలో పుంజుకోవడం ఖాయం. అందుకంటే గురుకులాల కార్యదర్శిగా తనదైన ముద్రవేశారు ఆయన. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉండే పిల్లలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన కృషిని అన్ని వర్గాలు ప్రశంసించాయి. ప్రస్తుతం గురుకులాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆర్ఎస్ కు ముందు, ఆర్ఎస్ కు తరువాత మాట్లాడుకోవాల్సి సిట్యూయేషన్ ఏర్పడింది. అంతలా ఆయన గురుకులాల విద్యా సంస్థలపై తన మార్క్ ను కనబరిచారు. ఈ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులను ఆయన ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అదే స్వేరో సంస్థ. అందులో దాదాపు 50 వేల మంది సభ్యులు ఉన్నారు. వారంతా ఆర్ఎస్ వెంటే నడిచే అవకాశం లేకపోలేదు.

ఏపీలో లాగా కుల రాజకీయాలు తెలంగాణలో నడవవు. తెలంగాణలో చైతన్యం ఎక్కువని అందుకే ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ , రిలిజీయన్ పాలిటిక్స్ కు స్కోప్ ఉండదనే విశ్లేషణలు ఉన్నాయి. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే మూడు ఆశయాలతో ఆర్ఎస్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఆయనను అన్ని వర్గాలు ఆశీర్వదిస్తాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరో వైపు…ఆయన కొన్నాళ్ళ క్రితం హిందూ దేవులను నమ్మననే ప్రమాణం చేయించాడనే ఆరోపణలు ఉండటంతో ఓ వర్గం మాత్రం ఆయనను దూరం పెట్టె అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరో వైపు ఆర్ఎస్ పొలిటికల్ ఎంట్రీపై తెలంగాణ దళిత, బహుజన సమాజం మాత్రం బాగా రీసివ్ చేసుకుంటోంది. ఆయన పొలిటికల్ ఎంట్రీని హర్షిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అటు మేధావి వర్గం కూడా ఆర్ఎస్ చేరికను స్వాగతిస్తోంది. బీఎస్పీకి చాలామంది మేధావుల అండదండలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆర్ఎస్ చేరికతో ఆ పార్టీకి తెలంగాణలో వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అవుతుందనేది విశ్లేషకుల అంచనా. ఆయన పార్టీలో చేరిన వెంటనే విశ్వవిద్యాలయాల్లో ఉండే విద్యార్ధి నేతలు కూడా ఆర్ఎస్ తో నడిచే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం పరోక్షంగా బీఎస్పీకి మద్దతు ఇచ్చిన వారు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్నారు. మరో వైపు డీఎస్పీ తో ఇంతకాలం కలిసి నడిచిన క్యాడర్ కూడా విశారదన్ ను వదిలేసి…ఆర్ఎస్ తో చేతులు కలిపే ఆలోచనలో ఉంది. ఇదే గనుకే జరిగితే వచ్చే ఎన్నికలని చెప్పలేం గాని..కొన్నాళ్ళ తరువాత అయినా గాని తెలంగాణ రాజకీయాల్లో బీఎస్పీ కీ రోల్ పోషించడం ఖాయం. అలాగే బహుజనులు అంత ఆర్ఎస్ నాయకత్వాన్ని గనక విశ్వసిస్తే తెలంగాణ నేలపై బహుజన సమాజ్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. చూడాలి మరి ఎం జరుగుతుందో…

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.