కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో ఓ వ్యూహం ప్రకారం టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలపై ఎలాగైతే కేసీఆర్ పదునైన విమర్శలను సందిస్తారో…రేవంత్ కూడా అంతే దీటుగా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. గులాబీ బాస్ స్టైల్ లోనే..అంతే ఘాటుగా మాట్లాడుతారు కాబట్టే ఆయనకు పీసీసీ చీఫ్ దక్కిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా హుజురాబాద్ లో గెలిచి నిలిచేందుకు కేసీఆర్ దళిత బంధు అస్త్రాన్ని ప్రయోగిస్తున్న వేళ.. దాన్ని ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ తో ముందుకు సాగుతున్నారు.
హుజురాబాద్ గెలుపు టీఆర్ఎస్ కు చాలా అవసరం. అక్కడి ఓటమి వచ్చే ఎన్నికలను ప్రభావితం చేస్తుందనేది గులాబీ పార్టీ పెద్దల అంచనా. అందుకే దళిత బంధు అస్త్రాన్ని తెరపైకి తీసుకువచ్చారు కేసీఆర్. ఎన్నికల స్టంట్ గా తీసుకువచ్చిన ఈ దళిత బందును కార్నర్ చేసేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం రచించారు. ఆగస్టు 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సభలో దళితులను కేసీఆర్ ఎలా మోసం చేశారో వివరిస్తూనే..దళిత బంధు అసలు సీక్రెట్ ను ప్రజల ముందు ఉంచాలనేది రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయకుండా.. ఒక దళిత బంధును మాత్రమే హుజురాబాద్లో పెట్టడానికి కారణమేంటని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. 1.35 కోట్ల మంది దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ దళితులను ఎలా మోసం చేస్తున్నారో వివరించేందుకే ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17వరకు దళిత గిరిజన దండోరా మోగిస్తున్నట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి.