తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపడుతున్నామని ప్రకటించగానే…ఈ పథకం హుజురాబాద్ ఎన్నికల స్టంట్ అని విమర్శలు వచ్చాయి. హుజురాబాద్ బైపోల్ కోసమే ఈ పథకమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు అని తేల్చి చెప్పారు.
టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధు ని కుండబద్దలు కొట్టారు ఆయన. హుజురాబాద్ ఎన్నికలున్నాయని దళిత బంధు పెట్టినవని కొందరు అంటున్నారని…అయితే పెట్టొద్ద మరి..గమ్మతున్నది..అరె ఎందుకు పెట్టం బై..టీఆర్ఎస్ ఏమైనా సన్నాసుల మఠమా? రాజకీయ పార్టీనే కదా..ఖచ్చితంగా ఒక పథకం పెట్టినప్పుడు రాజకీయ లబ్ది కోరుకుంటం..చేయనోడు లాభం కోరుకున్నప్పుడు..చేసినాడు లాభం కోరుకోవద్దా…ఇదేమి పద్ధతి..ఖచ్చితంగా టీఆర్ఎస్ రాజకీయ పార్టీ.. అంటూ చెప్పుకొచ్చారు కేసీఆర్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే దళిత బంధు అంటూ..బహిరంగంగా సమర్ధించుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. పరోక్షంగా డబ్బు పంపిణీ చేస్తున్నామని కేసీఆర్ ఈ కామెంట్స్ తో అంగీకరించనట్టేనా అని ప్రశ్నిస్తున్నారు.