చెరతో పొందిన స్పూర్తి
చెరబండరాజు ఈ పేరే ఓ విప్లవొత్తేజం. ఆయన అమరుడైన నలబయ్యేళ్ల తరువాత కూడ విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం మనదనే చెరగానం దేశం నలుమూల నవయవ్వనొత్తేజమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. నాటి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తేజితులైన వేలాది మందిలో నేకడిని. 1979 ఎడోతరగతి చదువుతున్న. మాది హరిదాస్ పల్లె. నగరం శివారులో రెండు గుట్టలు చిట్టడవి. రెండు చెరువులు వాటి నుంచి సాగుతున్న వాగుల మధ్య చిన్న పూరిండ్ల పల్లె. రజాకర్ల దాడులకు భయపడి నల్లగొండ జిల్లా భువనగిరి తాలుకా నుంచి వలస వచ్చిన రైతులు పొందించుకున్న ఊరు. డెబ్బైల మధ్యనాటికి ఆర్ట్ లవర్స్ తో ప్రభావితుడైన నేపాలీ యువకుడు ఉండె, ఆయన దగ్గరకు కళాకారులు కవులు రచయితలొచ్చెటోళ్లు. ఇటీవల అమరుడైన రైతుకూలీ సంఘం నర్సన్న వచ్చేది. అయితే బాల్యంలోనే ఉన్నందున రాజకీయల పట్ల అవగాహన లేదు. మేము చదువుకునేది ఆడికి ఎనిమిది కిలోమీటర్లు ఉండే చీరాల ప్రాధమిక పాఠశాలలో. ఊరికి దొర సీతారాంరెడ్డి బంగ్లా మా బడి ఎదురుంగనే దానికి ఉత్తరం బందుకు పోలీస్కచ్చీరు. మధ్యల రావిచెట్టుకింద తక్తుల దొర కూసునేది. గాయన అడున్నడంటే ఆ తొవ్వ బందు. తప్పిదారెవరన్నవోతే పిలిచి తన్నేది. బడి పోరలం . ఉరుకులటలో ఆటిటువొంగ రెండుమూడుసార్లు నేను బరిగె దెబ్బలుతిన్న. దండి కోపమొచ్చేది. బాట మీద బజార్ల గీవినిమోతేబరేందని. కాని మాట్లడవశంకాదు. మాట్లాడితే మా సార్లుగూడకొట్టేది. ఇటువంటిటైముల 79లో అనుకుంటా ఆ ఊర్లే రాడికల్ యువజన సంఘం సభ అన్నరు. మీటింగ్ ఏర్పాట్లు చూసేది మా బాద్దూర్ కాక. నర్సన్న. ఎర్ర జండాలు సైకిళ్లకు కట్టుకొని బొల్లారం సుభాష్ నగర్ నుంచి చాల మందొచ్చిండ్రు. సభలో ఉపన్యాసకుల్లో ఆర్ఎస్యు అధ్యక్షుడు రమణి. ఆర్వైఎల్ అధ్యక్షుడు శీనివాస్ విప్లవరచయితల సంఘం నాయకుడు చెరబండరాజు అని కరపత్రాల్లో ఉంది. మీటింగ్ రోజురానేఒచ్చింది. యూనివర్సిటీ విద్యార్థులు ఒచ్చిండ్రు. వాల్లలో ఆశాలత. గోపరాజు సుధక్కలున్నారు. మాకిదంతా కొత్తకొత్త అయితే కుషామతనిపించింది. ఊరంత కలెదిరుగుతున్నం. మా బడి ముందున్న పెద్దరుగు సభ జరిగే స్థలం. చీకటివడుతుండంగా మైకులు బడిముందున్న పైడితంగెడు చెట్టుకు కడితెందుకు ప్రయత్నం మొదలయ్యింది. అప్పుడొచ్చిండు దొర అరే ఎవడ్రా ఈడ మీటింగ్ వెట్టేదనుకుంటా. ఉరోళ్లు ఎటొళ్లటువొయ్యిండ్రు. మీటింగ్ దగ్గర బయటినుంచొచ్చిన కార్యకర్తలు మాత్రమే మిగిలిండ్రు. మీటింగ్ జరగనయ్యొద్దని దొర పంతం. జరిపితీరాలని కార్యకర్తలు. లొల్లయితనేఉంది. దొర ఎదో ఒర్రుకుంట బెదిరిస్తుండు. అప్పుడేసరసరొచ్చిండో ఒడ్డుపొడుగున్న మనిషి. ఒస్తనే గడ్డపారందుకుండు ఏహే ఏందిరా నీ పెత్తనం మీటింగ్ వెడ్తం ఎవనికి చెప్పుకుంటవోచెప్పుకో అని బాతగీసి నిలవడ్డడు. కార్యకర్తలు ఆయనపొంటి నిలవడ్డరు. దొర జర బెదిరిండు. కాని ఊరోళ్లు మీటింగ్ కాడికి పోవద్దని బెదిరించేటప్పటికి ఊరి మంది ఇండ్లళ్ల ఉండిపోయిండ్రు. దొరకు ఎదురు నిలవడ్డది విప్లవ రచయిత చెరబండరాజు. ఆయనతో అదే తొలి ముఖ పరిచయం. అన్యాయాన్ని ఎదిరించాలనే సంకల్పానికి తొలి ప్రేరణ. మొత్తానికి వేదిక మారిన సభ జరిగింది. వేదిక మారినప్పుడు బల్లలు మోసుడు గుంజలువాతుడు అంతటాతానై నిలిచిండు.
చెరబండరాజును కలిసి మాట్లాడిన రెండొ సందర్బం విప్లవ రచయితల సంఘం దశాబ్ది ఉత్సవాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాల్బజార్లో జరిగినయ్. నేను ఎనిమిదో తరగతి. మొదటిసారి వాలంటీర్ ను. పదమూడేండ్లుంటయెమో. బ్యానర్లు ఎర్రజండాల తోరణాలు కట్టడం చురుకుగా చేస్తున్నం. సభ జరుగుతున్న హాల్ ఎదురుగా బ్యానర్ కడితేందుకు కరెంటు స్తంభం ఎగబాకుతున్న. చెర గిదగిద ఉరుకొచ్చిండు. హైటెన్షన్ లైనది కరెంట్ షాట్గొడతిది దిగు అని పిలిచిండు. దిగంగనే గట్టిగా కడుపులకమురుకున్నడు. అప్పటికే పొద్దంతా పనిచేసి అలిసిపోయిన వాలంటీర్లకు చాయవెట్టి తీసుకొచ్చి పోసిచ్చి తాగిందనుక దగ్గర కూసున్నడు. ఆ సభలో ఆయన నిర్వహాకుడు వక్త. అయితే అన్ని పనుల్లో అన్న చోట్ల తానయి కనిపించేది. నాటి సభల్లో నిర్వహకుల్లో ప్రముఖ పాత్ర వహించిన సుభాష్ నగర్ పిఎస్ ప్రభాకర్ చంద్రపూర్ కార్మికోద్యమం నిర్మాణం చేస్తూ అమరుడయ్యాడు. రైతుకూలీ సంఘం నర్సన్న ఇటీవల ఆనారోగ్యంతో అమరుడయ్యాడు. ప్రజలతో మమేకమవ్వడం కార్యకర్తలను పట్టించుకోవడం అనేది చెరబండరాజు తన ఆచరణ ద్వార నేర్పిన తొలిపాఠాలు.మేథో కార్యాచరణలో ఉన్న రచయితలు కళకారులకు ఇది అనుసరనీయం మార్గదర్శకంగా విశ్వసిస్తాను