అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది తెలంగాణ సర్కార్ తీరు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ ప్రజలకు ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయలేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో అయినా సొంతిల్లు కట్టుకుందామంటే ఆ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదవాడి సొంతింటి కళ.. సాకారం అవ్వడం లేదు.
పేదలందరికీ సొంతిళ్ళను అందించాలనే లక్ష్యంతో కేంద్రం…ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి నిధులను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దీన్ని అమలు చేస్తోంది. కాని తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్రం…తెలంగాణ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం వాడటం లేదని..ఫలితంగా కేసీఆర్ సర్కార్ పై ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని తెలిపింది కేంద్రం. ఏడేళ్లలో ఈ స్కీమ్ కోసం రూ.849.01 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పింది. అయితే 2016, 2017 ఆర్థిక సంవత్సరాలకు కేటాయించిన రూ.190.78 కోట్లను వాడకపోవడంతో.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం. దీంతో తెలంగాణ సర్కార్ పై రాష్ట్ర బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దేశంలో అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొస్తే.. కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. 2016లో ప్రవేశపెట్టిన PMAY పథకం కింద రాష్ట్రానికి 70వేలకు పైగా ఇళ్లు మంజూరైతే… ఒక్కటి కూడా కట్టలేదని ఆరోపించారు. మొత్తంగా తెలంగాణ సర్కార్ తీరు అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు అన్నట్లుందని ఎద్దేవా చేస్తున్నారు.