తెలంగాణ గురుకులాల కార్యదర్శి , ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు స్వచ్చంద పదవీ విరమణ చేయాల్సి వచ్చింది..?గురుకులాలలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి..ఆ సంస్థలను మరింత ముందుకు తీసుకువెళ్తానని ప్రకటించిన ప్రవీణ్ కుమార్ తీసుకున్న ఈ సడెన్ డెసిషన్ కు రీజనేంటి..?కేసీఆర్ తో రిలేషన్ బాగానే ఉన్న ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..?ఇప్పుడు ఇవే ప్రశ్నలు బిగ్ డిబేట్ గా మారాయి.
తెలంగాణలో దళిత సామజిక వర్గం నుంచి వచ్చి…ఓ ముద్ర వేసుకున్న అధికారుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరు. కాని ఈయన ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి లాగే స్వచ్చంద పదవీ విరమణ చేయడం చర్చనీయంశంగా మారింది. ఆకునూరి మురళి వీఆర్ఎస్ కు కేసీఆర్ విధానాలే కారణం కాగా…తెలంగాణ సిఎంతో మంచి రిలేషన్ ఉన్న ప్రవీణ్ కూడా మురళి బాటలోనే సాగడం ఏమిటన్న చర్చ తెరపైకి వస్తోంది. కట్ చేస్తే…కేసీఆర్ వైఖరి వలెనే ప్రవీణ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేసినట్లు తెలుస్తోంది. గురుకులాల విషయంలో అమలు అవుతున్న సంస్కరణలపై తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సంస్కరణల క్రెడిట్ అంతా కేసీఆర్ కు కాకుండా ప్రవీణ్ కుమార్ ఖాతాలో పడిందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. గురుకులాల్లో జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక కోటా ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు కేసీఆర్ ను కోరారు. ఈ విషయాన్నీ కేసీఆర్ ప్రవీణ్ కుమార్ కు తెలియజేయగా..ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. గురుకులాల్లో పాలిటిక్స్ వద్దని సూచించినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో తెలిసిన ప్రవీణ్ కుమార్ ఆరోజే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితోనే ఆయన డీజీపీ స్థాయి కేడర్ వరకు ఎదిగే అవకాశం ఉన్నా మధ్యలోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులంటున్నారు.