నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బిజినేపల్లి మండలం సల్కరిపేట గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ భూ సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది.
తన భర్త చనిపోవడంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారని జ్యోతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ భూమి దగ్గరకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారసత్వంగా తనకు రావాల్సిన భూమి బంధువులు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆరోపిస్తోంది. చాలా రోజులుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కరించడం లేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల తీరుకు నిరసనగా నిప్పు అంటించుకునే సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీగార్డు, ఉద్యోగులు అడ్డుకుని అదనపు కలెక్టర్ చాంబర్ గదిలోకి తీసుకెళ్లారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జ్యోతికి న్యాయం జరిగేలా చూస్తానని, ఆత్మహత్య పరిష్కారం కాదని హామీ ఇచ్చారు.