ఇంటర్ అడ్మిషన్లను సరళీకృతం చేసిన సర్కార్

టెన్త్ అయిపోయిన విద్యార్థులు ఇంటర్ లో అడ్మిషన్ పొందే ప్రక్రియను ఏపీ సర్కార్ మరీ సరళీకృతం చేసింది. ఈ ఏడాది నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని అలాట్‌మెంట్‌ లెటర్‌ను కేటాయించిన కాలేజీలో సమర్పించేలా ఇంటర్ ప్రవేశాలను సులభతరం చేసింది సర్కార్.

ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్‌ ఫస్ట్ ఇంయర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు పూర్తి చేసింది. పూర్తి పారదర్శకతతో.. మెరిట్‌ ఆధారంగా విద్యార్థులు కోరుకున్న కళాశాలలో, గ్రూపులో సీటు పొందేలా ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇంటర్‌ బోర్డు గత విద్యా సంవత్సరంలోనే శ్రీకారం చుట్టింది. దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించేందుకు ఆమోదం లభించడంతో ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు వీలుగా గతేడాది ఇంటర్‌ బోర్డు అనేక సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీల అనుమతులు, రెన్యువల్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం ప్రవేశపెట్టింది.

గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌టికెట్‌ నంబర్, పాసైన సంవత్సరం, బోర్డు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూల్, కులం, ఆధార్‌ నంబర్ల వివరాల ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్‌ ఐడీ పాస్‌వర్డ్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి పూర్తి చిరునామా, మొబైల్‌ నంబర్‌ నమోదు చేశాక జిల్లాలు, కాలేజీలు, మాధ్యమాల వారీగా గ్రూపులతో వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన గ్రూపు, కాలేజీకి ప్రాధాన్య క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. తరువాత విద్యార్థి రిజర్వేషన్, పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది. విద్యార్థి మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ రూపంలో దాన్ని తెలియచేస్తుంది. అలాట్‌మెంట్‌ లెటర్‌ను పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని కేటాయించిన కాలేజీలో చేరాలి. పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజును ఆ కాలేజీకి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. అయితే ఫీజులను కమిషన్‌ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. విద్యార్థి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులోనే ఆయా సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయించి ఇంటర్‌ బోర్డే వాటిని ఆన్‌లైన్‌లో పరిశీలిస్తుంది. ప్రస్తుతం 2020–21కి విద్యార్థులకు ఫలితాలను ప్రకటించే ప్రక్రియలో ఇంటర్‌ బోర్డు నిమగ్నమై ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు శ్రీకారం చుడతామని బోర్డు వర్గాలు వివరించాయి.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *