హుజురాబాద్ బైపోల్ పై పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. అయితే ఉప ఎన్నికలు ఇప్పట్లో లేవనే సంకేతాలు వస్తున్నాయి. దేశంలో ఉప ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు భావిస్తున్నారు. గతంలో సెప్టెంబర్ లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఉంటుందని ఆలోచించినా అది ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ తో రాజీనామా చేయించడం వల్ల ఇప్పట్లో ఉప ఎన్నికల ఊసే లేదని చెప్పకనే చెబుతోంది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరిలో అంచనాలు పెరిగినా ప్రస్తుతం దాని ప్రభావం లేకపోవడంతో పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి. ఉప ఎన్నికలు ఈ సంవత్సరంలో నిర్వహించే అవకాశాలు లేవని తెలుస్తోంది. వచ్చే ఏడాదైనా ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టమైన ఆదేశాలు లేవు. దీంతో పార్టీలు ప్రస్తుతానికి ఎవరి పనులు వారే చేసుకునేందుకు ప్రాధాన్యత వహిస్తున్నాయని చెబుతున్నారు. ఉప ఎన్నికల తంతు ఇప్పట్లో లేకపోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. దీంతో8 ఆరు నెలల లోపు దేశంలో ఎక్కడి నుంచైనా గెలుపొంది శాసనసభ్యత్వాన్ని పొందాలి. మూడో దశ కరోనా ప్రభావం ఉందని హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.