ఆదుకోకపోతే మరో ఇంద్రవెల్లి: రేవంత్‌రెడ్డి

40ఏళ్లు అయినా ఇంద్రవెల్లి బాధితులకు న్యాయం జరగకపోవడం దారుణమని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ స్వరాష్ట్రంలోనూ ఇంద్రవెల్లి బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కలిపించాలని చెప్పారు. ప్రభుత్వాలు అండగా లేకపోతే మరో ఇంద్రవెల్లి సంఘటనకు దారితీయొచ్చని చెప్పారు.

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనుకుంటే ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. ఇంద్రవెల్లిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. అడవి బిడ్డలను మైదాన ప్రాంతాలకు తరలించడం సరికాదని వ్యాఖ్యానించారు. వారు ఉన్న చోటనే జీవించేలా వారికి వసతులు కలిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే రోజుల్లో రాజ్యం తమ చేతికి రాబోతుందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ స్పందించకుంటే ఇంద్రవెల్లి బాధితులకు, అడవి బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *