కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై పలు సూచనలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మరింత మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవాలని కోరారు. మహమ్మారిని నియంత్రించడంలో వ్యాక్సిన్ను సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇవ్వడమే ముఖ్యమైన విషయం అని ఆయన సూచించారు. ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశామని చెప్పడం కాదు.. అసలు జనాభాలో ఎంత శాతం మందికి వేశామో చూసుకోవాలని ఆ లేఖలో మన్మోహన్ అన్నారు.
వచ్చే ఆరు నెలల కోసం ఇప్పుడే వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇవ్వాలని, వాటిని రాష్ట్రాలకు పంపే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అత్యవసర అవసరాల కోసం 10 శాతం వ్యాక్సిన్లు మాత్రమే కేంద్రం దగ్గర ఉండాలని, అసలు వ్యాక్సిన్ అవసరాలు రాష్ట్రాలకే తెలుసు కాబట్టి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను బట్టి వాళ్లు ప్లాన్ వేసుకుంటారని మన్మోహన్ చెప్పారు.
వ్యాక్సిన్లను తయారు చేస్తున్న వాళ్లకు నిధులు, రాయితీలు ఇవ్వాలని మోదీకి మన్మోహన్ సూచించారు. కొవిడ్ పరిస్థితిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించిన మరుసటి రోజే మోదీకి ఆయన లేఖ రాశారు. శనివారం నాటికి దేశంలో 12.2 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.