షర్మిల మాటల్లో పదే పదే దొర.. రాజకీయ వర్గాల్లో చర్చ…

తన సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏమేరకు ఫలిస్తాయి.. తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించడమే ఏ మేరకు సక్సెస్ అవుతుంది..? సంకల్పయాత్రలో పదే పదే దొర దొర అన్న షర్మిల మాటలపై ఇప్పుడు రాజకీయ మేధావుల మధ్య చర్చగా మారాయి.

సభ ప్రారంభం నుంచి చివరివరకు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, రాష్ట్ర పాలనా తీరుపై షర్మిల విమర్శలు గుప్పించారు. సభలో షర్మిల సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగించగా.. అందులో కాంగ్రెస్, బీజేపీ ల గురించి మూడు, నాలుగు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. మిగతా సమయం మొత్తం సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసి విమర్శనాస్త్రాలు చేశారు. వైఎస్‌ పాలనలో ప్రవేశ పెట్టిన పథకాలను, ప్రజా సంక్షేమాన్ని గుర్తుచేస్తూ ప్రస్తుతం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల తీరుపై విమర్శలు గుప్పించారు. వాటన్నింటిని ప్రశ్నించేందుకే.. నిలదీసేందుకు తాను పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేసిన కేసీఆర్‌.. భజన బ్యాచ్‌ని పక్కన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ బానిస అయిందంటూ ఘాటుగా విమర్శించారు.

ఇదంతా చూస్తే.. కేసీఆర్ తన మాటల్లో ఏదైతే దూకుడుతనాన్ని.. దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తారో అదే తీరును షర్మిల అనుసరిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంతేకాదు.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆయన నిర్మోహమాటంగా ఉంటారు. ఎంతమాట అనేందుకైనా వెనుకాడరు. ఇందుకు తగ్గట్లే.. షర్మిల మాటల్లో పదే పదే ‘దొర’ మాటను వాడటం దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు.

కేసీఆర్ కు ఏ మాటలైతే అస్సలు ఇష్టం ఉండదో.. అవే మాటల్ని.. ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించని కొన్ని అంశాల్ని షర్మిల ప్రస్తావించటం ద్వారా.. రానున్న రోజుల్లో తన మాటల తీవ్రత మరింత పెరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. ఇదంతా చూస్తే.. తన రాజకీయ ప్రయాణంలో కేసీఆర్ అనుసరించిన మార్గాన్నే షర్మిల కూడా ఫాలో అవుతున్నారన్న భావన కలుగక మానదు.

ఇలాంటి ప‌రిస్థితిలో ష‌ర్మిల వ‌చ్చీరావ‌డంతోనే కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డాన్ని ప్రజ‌లు స్వీక‌రించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఈ ప‌రిణామం.. ఆమెకు క‌లిసి రాక‌పోవ‌చ్చని.. తెలంగాణ స‌మ‌స్యల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగి ఉంటే.. బాగుండేద‌ని సూచిస్తున్నారు. మొత్తానికి సంక‌ల్ప స‌భ‌.. ఆశించిన మేర‌కు వ‌ర్కవుట్ అవ‌లేద‌నే విశ్లేష‌ణ‌లు అంటున్నారు.

Load More Related Articles
Load More By BN chary
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.