బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఓ వైపు రసవత్తర పోరు జరుగుతుంటే.. మరోవైపు ఓ ఆడియో క్లిప్ వ్యవహారం కాకరేపుతోంది. తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ని బీజేపీ టార్గెట్ చేయడం దుమారం రేపుతోంది.. బెంగాల్ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ స్వయంగా ప్రశాంత్ కిశోర్ అంగీకరించారని ఆడియో క్లిప్ ను రిలీజ్ చేసింది బీజేపీ.
దేశంలో మోడీ ప్రభంజనం సృష్టించారని, బెంగాల్ లో ఆయన బహిరంగసభలకు జనంగా భారీగా వస్తున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కోటి మందికిపైగా హిందీ మాట్లాడేవాళ్లు, 27 శాతం దళితులు పూర్తిగా బీజేపీ వైపు ఉన్నారని ఆ ఆడియో క్లిప్ లో పీకే వ్యాఖ్యనించారు. అంతేకాకుండా సర్వేల సమయంలో ఏ ప్రభుత్వం వస్తుందంటే జనం బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెప్పారని పీకే స్వయంగా అంగీకరిస్తున్నట్లు ఆడియో క్లిప్ బట్టి తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ పై స్పందించారు ప్రశాంత్ కిశోర్. తమ నేతల మాటల కంటే తన చాట్ ను బీజేపీ సీరియస్ గా తీసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ చురకలు అంటించారు. అయితే తన ఛాట్ లోని ముక్కలపై ఆసక్తి కనబరచడం కంటే మొత్తం ఛాట్ ను షేర్ చేసి ధైర్యం చూపించి ఉంటే బావుండేదని పీకే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ వంద సీట్లకు మించి గెలిచే అవకాశం లేదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు తన ట్వీట్ ను సేవ్ చేసుకోవాలని, ఒకవేళ బీజేపీ వంద సీట్లు దాటితే ఏకంగా తన వృత్తికే గుడ్ బై చెబుతానన్నారు.