కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ప్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతిపై సమావేశమైన కేబినెట్, రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. తాజా అంక్షలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
మహారాష్ట్రలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతుండగా, తాజా నిర్ణయంతో రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు కూడా కేవలం 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ ఉద్యోగులు మాత్రం ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. పగటి వేళల్లోనే హోం డెలివరీ సర్వీసులను అనుమతించనున్నారు. బస్సులు, రైలు కూడా 50 శాతం సామర్థ్యంతోనే నడవనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా కర్ఫ్యూ అమలు సమయంలో హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశంలో మరోసారి వైరస్ తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పలుసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకుంటే లాక్ డౌన్ తప్పదని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. థియేటర్లు కూడా మూతబడనున్నాయి. కానీ, తక్కువ జనాభాతో షూటింగ్ లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వారాంతంలో మాత్రం కేవలం అత్యవసర సర్వీసులకు తప్ప మిగతా అన్ని బంద్ పాటించాలని ప్రభుత్వం సృష్టం చేసింది.