117 సంచార చేపల ప్రక్రియ వాహనాలను ప్రారంభించిన మంత్రులు

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మంచివారో అంతే రుచిగా తెలంగాణ చేప‌లు ఉంటాయ‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. సంచార చేప‌ల విక్రయ వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మంచి ఆలోచ‌న చేశారు. ఈ వాహ‌నాల‌ను అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల మ‌త్స్యకారుల‌కు ఉపాధి విరివిగా పెరుగుతుంద‌న్నారు. హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్‌లో జీహెచ్ఎంసీ, 29 జిల్లాల‌కు క‌లిపి 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ క‌లిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో చేప‌లు ఒక‌ట్రెండు చోట్ల మాత్రమే ల‌భిస్తాయి. దీంతో న‌గ‌ర ప్రజ‌లంద‌రూ చేప‌లు తినే అవ‌కాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో మంత్రి త‌ల‌సాని మంచి ఆలోచ‌న చేసి.. సంచార చేప‌ల విక్రయ వాహ‌నాల‌ను అందుబాటులోకి తెచ్చార‌న్నారు. ప్రస్తుతం 117 వాహ‌నాల‌ను ప్రారంభించుకున్నామ‌ని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని భావించిన సీఎం కేసీఆర్.. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు ఈ బ‌డ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించార‌ని తెలిపారు. మ‌త్స్యకారులు దుర‌దృష్టవ‌శాత్తు చ‌నిపోతే రూ. 6 ల‌క్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని మంత్రి హ‌రీష్ రావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, అరికెపుడి గాంధీ, భేతి సుభాష్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.