కర్నూలు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. దీనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేశారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఇది గొప్పరోజు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు కొనసాగుతాయని చెప్పారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు సర్వీసులు ఉంటాయని వెల్లడించారు.
ఈ విమానాశ్రయానికి తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరిట నామకరణం చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంతో తన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయిందని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లదొరలపై పోరాట బావుటా ఎగురవేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడని చిరంజీవి వెల్లడించారు.
ఉయ్యాలవాడ అత్యంత గొప్ప దేశభక్తుడని, అయితే చరిత్రలో మరుగునపడిపోయాడని వివరించారు. అలాంటి వీరుడి పేరు ఎయిర్ పోర్టుకు పెట్టడం అత్యంత సముచిత నిర్ణయమని కొనియాడారు. కాగా, అంతటి యోధుడి పాత్రను తెరపై తాను పోషించడం తనకు దక్కిన అదృష్టంగా, గౌరవంగా భావిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. ఉయ్యాలవాడ జీవితకథతో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.
దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. నాడు చిరంజీవి ‘సైరా’ చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గుర్తు చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇప్పుడు కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరుపెట్టడం ద్వారా ఆయన కీర్తిని శాశ్వతం చేశారని కొనియాడారు.
కాగా, ఈనెల 28 నుంచి కర్నూలు విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఉడాన్ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ సర్వీసెస్ నడపనుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నైకు రెండేళ్ల పాటు ఇండిగో సంస్థ విమాన సర్వీసులు నడపనుంది. కొత్త టెక్నాలజీతో ఏటీసీ టవర్, టెర్మినల్ భవనాలు నిర్మించారు. రాత్రిళ్లు విమానాలు దిగే సమయంలో విద్యుత్తు టవర్లు గుర్తించేలా ఏర్పాట్లు చేశారు.